హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ‘గెట్ అవుట్ ఫ్రం మై డిబేట్’ వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెనక్కితగ్గింది. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావును ఉద్దేశించి ‘గెట్ అవుట్ ఫ్రం మై డిబేట్’ అన్నందుకు విచారం వ్యక్తంచేస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం వార్తా కథనం ప్రచురించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్ నిర్వహించారు. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిపి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారంటూ సోషల్‌మీడియాతోపాటు కొన్ని న్యూస్ చానళ్లలో తప్పుడు వార్తలు ప్రసారమయ్యాయి.
ఈ అంశంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావును ఏబీఎన్ డిబేట్‌కు గెస్ట్‌గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సిట్ విచారణపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని తక్కళ్లపల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని హితవు పలికారు. తక్కళ్లపల్లి మాట్లాడుతుండగానే.. అసహనానికి లోనైన ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ.. ఎమ్మెల్సీ రవీందర్రావును ఉద్దేశించి ‘గెట్ అవుట్ ఫ్రం మై డిబేట్’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చానల్‌కు డిబేట్ కోసం ఆహ్వానించి ఎమ్మెల్సీ అనే స్థాయిని మరచి ఇలా అవమానిస్తారా? అంటూ యాంకర్, ఏబీఎన్ చానల్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పార్టీ సైతం ఏబీఎన్ చానల్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ చానల్లో జరిగే చర్చా కార్యక్రమాలకు తమ పార్టీ నేతలెవరూ వెళ్లొద్దని, పార్టీ నేతలు నిర్వహించే మీడియా సమావేశాలు, బహిరంగ సభలకు కూడా ఆ చానల్ ప్రతినిధులను అనుమతించవద్దని నిర్ణయించింది. మరోవైపు, తనకు జరిగిన అవమానంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కూడా ఎమ్మెల్సీ రవీందర్రావు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ చానల్ విచారం వ్యక్తంచేస్తున్నట్టు ప్రకటించింది.