నాంపల్లి కోర్టులు, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు శనివారంతో ముగియనున్నది. వైద్య కారణాల రీత్యా ఇప్పటివరకు ఆయన బెయిల్‌ను మూడుసార్లు పొడిగించిన నాంపల్లి కోర్టు.. ఈ గడువు ముగిసిన వెంటనే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కాగా, ఈ కేసులో మిగతా రిమాండ్ ఖైదీలుగా ఉన్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది.
ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుతోపాటు మరో నిందితుడైన ఐన్యూస్ ఎండీ శ్రావణ్‌కుమార్ విదేశాల్లో ఉండటంతో నాన్-బెయిలబుల్ వారెంట్ కొనసాగుతున్నది. ఇంటర్‌పోల్ ద్వారా వారిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి ఇటీవల 14వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులోని నిందితులంతా బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.