జూలపల్లి, మే 25 : ‘సార్..సెంటర్‌కు వడ్లు తెచ్చి ఇరువై రోజులైతంది. మంచిగా ఎండబోసినం.. అప్పటి సంది ఇక్కడే పడిగాపులు కాత్తున్నం..కానీ కాంటాపెడ్తలేరు.. కడుపు మండుతున్నది.. మరి కొంటరా? వడ్ల కుప్పకు అగ్గిపెట్టమంటరా?’ అంటూ ఓ యువరైతు పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. శనివారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ సందర్శించారు. రైతులతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన మల్లెత్తుల రాజు అదనపు కలెక్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ దిక్కు అకాల వర్షాలు మమ్మల్ని ఆగం జేత్తున్నయ్. సెంటరోళ్లు మాత్రం ఏమీ పట్టన్నట్టు ఉన్నరు. గన్నీ సంచులు ఇచ్చి చేతులు దులుపుకున్నరు. తూకం వేసేదెప్పుడో? ధాన్యం మిల్లులకు తరలించేదెప్పుడో? మా ఖాతాల్లో పైసలు ఎప్పుడు ఎస్తరో? అని అడిగాడు. స్పందించిన అదనపు కలెక్టర్ సెంటర్ నిర్వాహకులు, స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు రావడంలేదని.. హమాలీల కొరత ఉన్నదని సమాధానమిచ్చారు. దీంతో వెంటనే లారీలను తెప్పించి.. వడ్లను కొనుగోలు చేయాలని సిబ్బందిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఒక దశలో సస్పెండ్ చేయమంటవా? నీకు చేతగాకుంటే ఇతరులకు అప్పగిస్తానని అని సింగిల్‌విండో సీఈవో గీస సురేశ్‌ను హెచ్చరించారు. సీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సహకారశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, తాహసీల్దార్ బషీరొద్దీన్ ఉన్నారు.