హైదరాబాద్ : పాఠశాలకు అనుమతి విషయంలో గత నెల రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) పట్టుబడి సస్పెన్షన్‌కు గురైన వెంకట్ రెడ్డి ( Venkat Reddy ) నివాసాల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే (Illegal assets) ఆరోపణలతో వెంకట్‌రెడ్డి నివాసాల్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

నల్గొండ, మిర్యాలగూడ ,హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల నివాసాల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ.4.65 కోట్ల విలువైన విల్లా, ఒక ప్లాట్‌ను , రూ.60 లక్షల విలువ గల ఒక కమర్షియల్ షాప్ ఉన్నట్లు గుర్తించామని వివరించారు. రూ.65 లక్షల విలువైన 8 ఓపెన్ ప్లాట్లు, రూ.50 లక్షల విలువ గల 14.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు లభించిన డ్యాక్యుమెంట్ల ద్వారా గుర్తించామని తెలిపారు.
అదే విధంగా రూ.30 లక్షల నగదు, రూ.44 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.11 లక్షల హౌజ్‌హోల్డ్ ఆర్టికల్స్, రూ.40 లక్షల విలువగల వాహనాలు, రూ.4.35 లక్షల బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు. వీటి మొత్తం విలువ రూ.7.69 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు.