కన్నెపల్లి/ సుబేదారి, డిసెంబర్ 5 : ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాలకు కక్కుర్తి పడిన అధికారులు శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్‌రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్ కోసం రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. హనుమకొండ కుమార్‌పల్లిలోని క్రియేటివ్ మోడల్ స్కూల్ రెన్యూవల్ కోసం స్కూల్ డైరెక్టర్ సతీశ్‌ను అడిషనల్ కలెక్టర్ వెంకటర్‌రెడ్డి రూ.లక్ష డిమాండ్ చేశాడు. హనుమకొండ సుబేదారిలోని కలెక్టరేట్ ఆవరణలో స్కూల్ డైరెక్టర్ సతీశ్ నుంచి విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్లు మనోజ్, గౌస్ రూ.60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని విచారణ చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఆదేశాల మేరకే రూ.60 వేలు లంచం తీసుకుంటున్నట్టు వారు అగీంకరించారు.
వెంటనే కలెక్టరేట్లోని అడిషనల్ కలెక్టర్ ఆఫీస్‌లో వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించి, కేసు నమోదు చేసి ముగ్గురుని రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని గానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత గానీ, కలెక్టరేట్లో ఓ ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడడం ఇదే మొదటిసారి కావడం, అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచనలంగా మారింది.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్‌కుమార్ ఓ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించేందుకు రూ. 10 వేల లంచం డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని బాధితుడు వేడుకోగా, చివరకు రూ. 5 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ మేరకు బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. నల్లగొండ జిల్లా చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ సమచార హక్కు చట్టంలో దరఖాస్తు చేసుకున్న సమాచారం ఇవ్వడానికి ఒక భూ యజమాని వద్ద రూ.20వేలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి పట్టుబడ్డాడు. బాధితుడి వివరాల ప్రకారం గట్టుప్పల్ గ్రామంలో తమ తండ్రి పేరుపై ఉన్న 58 ఎకరాల 31గుంటల భూమిలో నుంచి 2008లో అక్రమంగా సాదాబైనామా పేరుతో ఎక్బాల్బేగ్ అనే వ్యక్తి పేరుపై 21ఎకరాల 13గుంటలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.ఆ మ్యుటేషన్, ప్రొసీడింగ్ కాపీ కావాలని కోరగా డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రూ.20వేలు లంచం అడిగారు. ఈ మేరకు డీటీకి లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.