TGS RTC | మెదక్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులపైన స్పెషల్ పేరిట ఆర్థిక భారం మోపుతున్నది రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీజీఎస్ఆర్టీసీ). పండుగకోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నది. స్పెషల్ బస్సుల పేరిట బోర్డులు తగిలించి ముకుపిండి అధిక చార్జీలు వసూలు చేస్తున్నది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అవసరమైన మేరకు బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధిక చార్జీలు పెట్టి కూడా దూర ప్రాంతాలకు నిలబడి పోవాల్సి వస్తున్నదని పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిర్మల్, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి నుంచి నడిపిస్తున్న కొన్ని బస్సులకు దూర ప్రాంతాల బోర్డులు వేసి స్పెషల్ పేరుతో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల నుంచే తమకు ఆదేశాలు ఉన్నాయంటూ దబాయిస్తున్నారు.
ఆదివారం జేబీఎస్ నుంచి మెదక్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులో డ్రైవర్‌తో ప్రయాణికులు ఘర్షణకు దిగారు. మెదక్ డిపో నుంచి సంక్రాంతి స్పెషల్‌గా ఎక్స్‌ప్రెస్ బోర్డుతో వచ్చిన టీఎస్ 35 జడ్ 0022 బస్సు ఉదయం 7:30 గంటలకు జేబీఎస్‌కు చేరుకుంది. జేబీఎస్లో ఆ బస్సు ఎకిన ప్రయాణికులతో డ్రైవర్ టికెట్ ఇచ్చి అధికంగా వసూలు చేశాడు. జేబీఎస్ నుంచి మెదక్‌కు రూ.160 చార్జి కాగా, అదనంగా రూ.80 వసూలు చేసి రూ.240 టికెట్ ఇచ్చాడు. అక్కడే ఉన్న మెదక్ డిపో మేనేజర్‌ను ఇదేమిటని అడుగగా, సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ పేరిట చార్జీలు వసూలు చేస్తున్నామని సమాధానమిచ్చారు. జేబీఎస్ నుంచి నిర్మల్‌కు 650 వసూలు చేశారు.