హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం ఇచ్చిం ది. శుక్రవారం గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందజేశారు.
ప్రధాని మోదీ, అదానీ బంధాన్ని మోదానిగా ఏఐసీసీ పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణలో అదానీ, రేవంత్‌రెడ్డి జంటను ఏమని పిలవాలి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఏఐసీసీ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఫొటో కింద.. ఈ రోజు ప్రశ్న అనే శీర్షికన ‘మోదీజీ అదాని కీ ఏజెంట్ హై? అని ప్రశ్నిస్తూ.. ఏ: అవును, బీ: అనుమానమే లేదు, సీ: బిల్కుల్, డీ: పైవన్నీ అనే నాలుగు ఆప్షన్లు ఇచ్చింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి, అదానీ ఫొటోను ట్యాగ్ చేసి ఈ జంటను ఏమని పిలుద్దాం? అని ప్రశ్నించారు. రేవంత్+అదానీ = రేవ్దానీ, రా..జీ+అదాని+రాగ్దానీ అంటూ ఎద్దేవా చేశారు.