Kodangal | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 25 (నమస్తే తెలంగాణ): కొడంగల్‌లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రేవంత్ సర్కారు కసరత్తు చేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ ప్రాంత రైతాంగంపై మరో పిడుగుపాటు! కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పొగనే కాదు… సిమెంటు సెగ కూడా పెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది. అం దునా… అదానీ ఆధ్వర్యంలో ఈ సిమెంటు ప్లాంటు ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) కూడా సమర్పించారు. రామన్నపేటలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది సిమెంటు గ్రైండి ంగ్ యూనిట్‌ను మాత్రమే… కానీ కొడంగల్‌లో కాలుష్యం ఎక్కువగా ఉండే సిమెంటు ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. రామన్నపేటలో యూనిట్ సామర్థ్యం 6 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా… కొడంగల్‌లో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో అదానీ సామ్రాజ్య విస్తరణకు రూపుదిద్దుకుంటున్న ప్రణాళిక జాబితాను సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రెస్మీట్లో మీడియాకు ఇచ్చారు. ఇందులో కొడంగల్‌లో ఆదానీ సిమెంట్ ప్లాంటు ఏర్పాటు కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉందనే సంచలనాత్మక విషయం వెల్లడైంది.
లగచర్ల లడాయి వీడక ముందే..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు 14వేల ఎకరాల పైచిలుకు భూసేకరణ పూర్తి చేసినప్పటికీ… రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పది ఫార్మా క్లస్టర్ల కోసం 20 వేల ఎకరాల వరకు భూసేకరణకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా కొడంగల్‌లో ఫార్మా క్లస్టర్ కోసం మొదటిదశ భూసేకరణ చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల – హకీంపేట – లగచర్ల – పోలేపల్లి వంటి ఏడు ప్రాంతాల్లో 1376 ఎకరాల సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా… లగచర్ల లడాయి తారాస్థాయికి చేరుకున్నది. ఎనిమిది నెలలుగా ఆ ప్రాంత ప్రజలు ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంటి మీద కునుకు లేకుండా పోరాడుతూనే ఉన్నారు. తమ ప్రాణాలు పోయినా.. ఫార్మా కంపెనీలకు భూములిచ్చేదిలేదని తెగేసి చెబుతున్నారు. పచ్చని పంట పొలాల్లో కాలుష్యచిచ్చు పెట్టొద్దని రైతులు భారీ ఎత్తున ఉద్యమిస్తున్నారు. తాజాగా మరో విస్మయకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదానీ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అదానీ గ్రూపు ప్రాజెక్టు వివరాలపై జాబితా విడుదల చేశారు. ఇందులో 11వ అంశంగా రామన్నపేటలో 6 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, పర్యావరణ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. 12వ అంశంగా కొడంగల్‌లో ఆదానీ సిమెంట్ ప్లాంటును 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటుకు ఈవోఐను ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలిపారు. అంటే ఈ ప్లాంటు ఏర్పాటుకు గుట్టుచప్పుడు కాకుండా ముమ్మర కసరత్తు జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది.
పచ్చని పొలాల్లో మరో చిచ్చు
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా అందునా కొడంగల్ నియోజకవర్గం అనేది మారుమూల ప్రాంతం. భూముల ధరలు కూడా తక్కువగా ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా ఏర్పడటం… గతంలో ఏమాత్రం సాగుకు అవకాశంలేని ప్రాంతంలో కాగ్నా నదికి మెరుగైన ఇన్‌ఫ్లోలు రావడం… ప్రతి ఏటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి రైతుబంధు చేతికి అందడం, 24 గంటల ఉచిత కరెంటుతో మారుమూల ప్రాంతాల్లోనూ వ్యవసాయం పండుగలా మారింది. ఇందులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోనూ రివర్స్ వలసలతో బీడు భూములు పచ్చని పొలాలయ్యాయి. అందుకే లగచర్ల ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కేవలం ఇక్కడే కాదు… నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా రైతులు సమృద్ధిగా పంటలు పండించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలే కాకుండా ఆదానీ సిమెంటు ప్లాంటుకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తుందనే సమాచారం సోమవారం వెల్లడికావడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా సిమెంటు ప్లాంటు నుంచి కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాంటు ఏర్పాటుకు మరిన్ని వందల ఎకరాల పచ్చని భూములను సేకరించక తప్పదనే వాస్తవం స్పష్టమవుతుంది.