మక్తల్ : బీఆర్ఎస్ ( BRS ) రజతోత్సవ మహాసభను విజయవంతం చేసే బాధ్యత మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలపై ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy ) అన్నారు. రజతోత్సవ ( Silver Jubilee ) సభకు పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాట్లలో భాగంగా బుధవారం తన నివాస గృహంలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సారథ్యంలో రజతోత్సవ మహాసభను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు కదిలిన కేసీఆర్( K Chandrashekar Rao ) ఎన్ని ఆటుపోట్లు వచ్చినా లెక్కచేయకుండా, ఆంధ్ర వలస పాలకుల నుంచి తెలంగాణ ప్రజానీకానికి విముక్తి కల్పించారని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టి ఆగమైన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారని పేర్కొన్నారు. దేశాన్ని 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని కేసీఆర్ 10 సంవత్సరాలలో చేసి చూపించారని స్పష్టం చేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఆకాశంలో చుక్కలు చూపించి, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను సైతం అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నను విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన పోయి, రాక్షస పాలన వచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.