Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్26(నమస్తే తెలంగాణ): ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట కూల్చివేతల కాండ సాగించిన కాంగ్రెస్ సర్కార్, ఇక జిల్లాల్లోనూ బుల్డోజర్లు పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పాలమూరు జిల్లా క్రిస్టియన్‌పల్లి తరహాలో మరిన్ని కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, ప్రభుత్వ భూముల్లో ఉన్న భవనాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయలని కలెక్టర్లకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కూల్చివేతలకు రెవెన్యూ అధికారులు నాయకత్వం వహించాలని, హైడ్రా తరహా బృందాలను లీడ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి.
గురువారం తెల్లవారుజామున సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు ఇండ్లను అధికారులు కూల్చివేశారు. ఎర్రచెరువు బఫర్ జోన్లో ఉన్నదని ఒక ఇంటిని, మున్సిపల్ అనుమతి లేదని మరో ఇంటిని రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు కూల్చి వేశారు. ఎర్ర చెరువు సమీపంలో ఓ వ్యక్తి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు. అతడి ఇల్లు బఫర్ జోన్లో ఉన్నదంటూ రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. మరో ఐదు కుటుంబాలకు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. పట్టణం 5వ వార్డులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అనుమతి పొంది ఇల్లు కడుతున్నారనే ఆరోపణతో మరో ఇంటిని కూలగొట్టారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా, అనుమతించిన ప్లాన్ ప్రకారం లేకుండా కట్టిన ఇండ్లను అక్రమ నిర్మాణాలుగానే గుర్తించి కూల్చి వేస్తామని మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు. గతేడాది ఆగస్టు 23 తర్వాత సిద్దిపేట పట్టణంలో 58, 59 జీవోల కింద పట్టాలిచ్చిన దాదాపు 200కు పైగా ఇంటి స్థలాలకు రీ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సంగారెడ్డి జిల్లాలోనూ రెవెన్యూ అధికారులు ఓఇంటిని కూల్చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూరంలో నర్సింహులు అనే వ్యక్తి భవనం కట్టుకున్నాడు. దానికి గ్రామ పంచాయతీ అనుమతించింది. కాగా పెద్ద చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి భవనం కట్టాడన్న కారణంతో కూల్చేశారు.
గత ఆగస్ట్ చివరి వారంలో మహబూబ్‌నగర్ పట్టణంలో భారీగా కూల్చివేతల కాండ కొనసాగింది. పొద్దంతా కష్టం చేసిన ప్రజలు ఆదమరిచి నిద్రపోతున్న వేళ క్రిస్టియన్పల్లిమీద రెవెన్యూ అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. 75 ఇండ్లను తెల్లవారేలోపు నేలమట్టం చేశారు. బాధితుల్లో బదిరులు, అంధులు, దివ్యాంగులే ఎక్కువగా ఉన్నారు. రెవెన్యూ అధికారులే 2007లో ఇవే ఇండ్లకు పట్టాలిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వారికి విద్యుత్తు కనెక్షన్ ఇచ్చి, నీటి సౌకర్యం కల్పించింది. ఇవేవీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు దివ్యాంగుల ఇండ్లను కూలగొట్టారు. ఈ నెల మెదటి వారంలో రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మండలం మల్కం చెరువు వద్ద 40 ఇండ్లను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇక్కడి పేదలు చెరువుకు దూరంగా ఇండ్లు కట్టుకొని 40 ఏళ్ల నుంచి ఉంటున్నరు. అర్ధరాత్రి వేళ ఆ ఇండ్లను నేలమట్టం చేశారు. కానీ ఇదే చెరువును ఆక్రమించి జాతీయ స్థాయిలో పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆకాశహర్మ్యాలు నిర్మించాయి. ఏకంగా మల్కం చెరువునే ఆక్రమించి బహుళ అంతస్థుల భవనాలు కట్టాయి. కానీ రెవెన్యూ అధికారులు వాటివైపు కన్నెత్తి చూడకుండా పేదల ఇండ్లను కూలగొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.