హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై సీఎం స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్నిచోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటివాటికి పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అనంతరం గణేశ్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి పలువురు మంత్రులు, సీఎస్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు.