హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన గుర్తును మార్చిన అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఈవో వికాస్‌రాజ్ ఓ ప్రకటన విడుదలచేశారు. ఒక్కసారి గుర్తు కేటాయించిన తరువాత దానిని మార్చే అధికారం రిటర్నింగ్ అధికారికి లేదు. రిటర్నింగ్ అధికారి గుర్తును మార్చిన విష యం వివాదం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారిని తొలగించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది. చౌటుప్పల్ మండలంలో ఈవీఎంలపై షిప్ బొమ్మకు బదులుగా ఒక వ్యక్తి పడవను నడుపుతున్న ఫొటోను వేసిన విషయంలో సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ చౌటుప్పల్ ఎమ్మార్వోను సస్పెండ్ చేసింది.