హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : కామెడీ పేరుతో, సోషల్ మీడియా రీల్స్ పేరుతో ఫేమస్ కావడానికి ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ‘ఇదేం వెర్రి కామిడీ? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైనా వేస్తారా?
మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా? ఇక నుంచి ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు, ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చరించారు. ఓ వ్యక్తి బస్ రూట్ గురించి అడిగి.. రీల్స్ పేరుతో ఓ కండక్టర్ను ఇబ్బందిపెట్టిన తీరుపై సజ్జనార్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.