హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు నిజాం ప్రభుత్వం హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలను నిర్మించింది. మొన్నటికి మొన్న కృష్ణా, గోదావరి ఎండిపోయి వేసవిలో తాగునీటి సమస్య వస్తే ఈ జలాశయాలే నగరవాసుల దాహం తీర్చాయి. కొంతమంది శ్రీమంతులు ఈ చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకొని మురుగు కాల్వలను జంటజలాశయాల్లో కలిపారు. సామాన్యుల తాగునీటి చెరువుల్లో మురుగు నీరు కలపడాన్ని చూస్తూ ఊరుకుంటే.. అక్రమ నిర్మాణాలను అలాగే వదిలేస్తే.. ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా? కాదా? -2024, ఆగస్టు 26న కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్స్ అనంతశేష స్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో/ మణికొండ, మే 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాలు కలుషితమవుతున్నాయని, వాటిని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందని హైకోర్టు ప్రశ్నించడంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలోని ఆక్రమణలపై మళ్లీ చర్చ మొదలైంది. నిరుడు రేవంత్‌రెడ్డి హడావుడి చేసి హైడ్రాను పంపి ఈ జలాశయాల పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయించినా తర్వాత ఒక్కసారిగా గప్‌చుప్ అయ్యారు. జలాశయాల విషయంలో రేవంత్ సర్కారు వెనక్కి తగ్గింది. పొంగులేటి రాజభవనమో.. వివేక్ విస్తరణ మహిమో గాని మొత్తానికి కాంగ్రెస్ నేతల భవనాలే అధికంగా ఉండటంతో ఇక మారు మాట్లాడకుండా సైలెంట్ అయింది. కానీ జీవో 111 పరిధిలో ఉన్న స్థానికులు కొందరు దీనిపై భగ్గుమన్నారు. పెద్ద మంగలారానికి చెందిన మందాడి మాధవరెడ్డి వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జలాశయాల పరిరక్షణ, కాలుష్యంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. జలాశయాల పరిధిలో ఆక్రమణలు, మురుగునీరు చెరువుల్లోకి చేరటంపై నివేదిక కోరింది. అక్కడున్న కన్వెన్షన్ సెంటర్ల కారణంగా వస్తున్న మురుగు.. కాలవల ద్వారా చెరువుల్లోకి చేరుతున్నది. ఇది అందరికీ కనిపిస్తున్నా ఏ అధికారీ ఆ దిక్కు చూడడు. ఇదేంటని ప్రశ్నించరు. ఎప్పుడైనా ఉన్నతాధికారులు, న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తే అప్పటికప్పుడు కొంత హడావుడి చేసి మళ్లీ చేతులు దులిపేసుకోవడం పరిపాటిగా మారింది.
‘మురుగు’ సాగరాలు!
చారిత్రక జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ మురుగుతో కలుషితమవుతున్నాయి. 3.9 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఉస్మాన్‌సాగర్ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నది. దీని పరిధిలో 84 గ్రామాలున్నాయి. ఉస్మాన్‌సాగర్ సమీపంలో నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ప్రాంతాలు ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందాయి. హిమాయత్‌సాగర్ కూడా 2.9 టీఎంసీల సామర్థ్యంలో 35 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంతో విస్తరించి ఉన్నది. దీని పరిధిలోకి శంషాబాద్, మొయినాబాద్, అజీజ్‌నగర్, కొత్వాల్‌గూడ, కవ్వగూడ, సుల్తాన్‌పల్లి, నర్కుడ, నాగిరెడ్డిగూడ తదితర ప్రాంతాలు వస్తాయి. ఎగువ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న కన్వెన్షన్ సెంటర్లు, వ్యాపార సముదాయాల ద్వారా వెలువడే మురుగునీరు ఈ జలాశయాల్లోకి వచ్చి చేరుతున్నది.
నగరవాసులకు సరఫరా అవుతున్న నీటిలో సగం వరకు మురుగునీరు కలుస్తున్నదన్నదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన శంకర్పల్లి, బుల్కాపూర్, మోకిల, జన్వాడ ప్రాంతాల్లో వెలసిన కన్వెన్షన్ సెంటర్లు, నిర్మాణాల ద్వారా వస్తున్న మురుగు మొత్తం ఉస్మాన్‌సాగర్‌లోకి వచ్చి చేరుతున్నది. మొయినాబాద్, శంషాబాద్ మండలాల పరిధిలోని అజీజ్‌నగర్, సురంగల్, కొత్వాల్‌గూడ తదితర ఎగువ ప్రాంతాల్లో వెలసిన కన్వెన్షన్లు సెంటర్లు, ఇతర లే అవుట్లు, వ్యాపార సముదాయాల నుంచి వస్తున్న మురుగు హిమాయత్‌సాగర్‌లో కలుస్తున్నది. ఇంత బాహాటంగా తాగునీరు కలుషితమవుతున్నా సంబంధిత యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. హిమాయత్‌సాగర్, గండిపేట పరీవాక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించడం ఏమిటని హైకోర్టు ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన ఆ అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కాంగ్రెస్ నేతలవే ఎక్కువ!
జంటజలాశయాల పరిధిలో నిర్మించిన ఫామ్‌హౌస్‌లు, అక్రమ నిర్మాణాలతో మురుగంతా జలాశయాల్లోకి చేరుతున్నది. నిరుడు సీఎం రేవంత్‌రెడ్డి జంట జలాశయాల్లో ఆక్రమణలపై మాట్లాడుతూ ప్రజలు మురుగునీటిని తాగాలా? అందుకే హైడ్రాకు అన్ని అధికారాలూ ఇస్తున్నామని చెప్పినా ఆక్రమణల తొలగింపుపై పెద్దగా అడుగులు పడలేదు. అక్కడ కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు ఎక్కువగా ఉండటంతో వారి ఒత్తిడి మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. మళ్లీ ఇప్పుడు హైకోర్టు జంటజలాశయాల ఆక్రమణలపై ప్రభుత్వానికి చురకలంటించడం.. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఈ అంశంపై చర్చ జరుగుతున్నది. ‘అసలు జంట జలాశయాలపై రేవంత్‌రెడ్డి మొదట్లో మాట్లాడిన మాటలకు ఎందుకు కట్టుబడి ఉండటం లేదు? అక్కడ పొంగులేటి, కేవీపీ, వివేక్ వంటి నేతల నిర్మాణాలు ఉన్నాయనే వెనక్కు తగ్గారా?’ అంటూ అప్పట్లో అందరిలోనూ ప్రశ్నలు తలెత్తాయి. ఒకప్పుడు గంగాళాలుగా ఉన్న జంట జలాశయాలు ఇప్పుడు తాంబాళాలయ్యాయి. వాటి పక్కనే రాజభవనాలు వెలిశాయి. వాటిలో ఎక్కువగా కాంగ్రెస్ నాయకులవే ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీ రాంచందర్‌రావు, పల్లంరాజు వంటివారి భవనాలు ఉన్నాయి.
కన్వెన్షన్ సెంటర్లపై చర్యలేవి?
జంట జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో కాలుష్య, కలుషిత ప్రేరేపిత కార్యకలాపాలు నిర్వహించటం, సముదాయాలు ఏర్పాటు చేయటం నిషేధం. కానీ ఇష్టానుసారంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల ఎగువ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు వెలిశాయి. హైకోర్టును ఆశ్రయించిన స్థానికుడు తన పిటిషన్లో పేర్కొన్న ప్రకారం అక్కడ ఉన్న ఐదు కన్వెన్షన్ సెంటర్లతో చెరువుల్లోకి మురుగునీరు వచ్చి చేరుతున్నది. ఈ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఒక్కో కార్యక్రమానికి మూడు నుంచి నాలుగు వేల మంది జనాభా వస్తుంటారు. అక్కడి కార్యకలాపాల నుంచి మురుగు, సమీప గ్రామాల నుంచి వెలువడే మురుగు అంతా దిగువన ఉన్న చెరువు లింకు కాలువల్లోకి వచ్చి వాటి ద్వారా జలాశయాల్లో కలిసిపోతున్నది. వీటి పరిరక్షణపై ఎందుకు సర్కారు ఉదాసీనతగా ఉంటున్నదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. నగర వాసులకు శుద్ధజలాలు అందిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, జీవో 111 పరిధిలోని నివాసితులు ప్రశ్నిస్తున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్‌గూడలో ఏకంగా హిమాయత్‌సాగర్ చెరువును ఆనుకొని ఓ కన్వెన్షన్ సెంటర్ ఉన్నది.
ఇక్కడి నుంచి మురుగునంతా చెరువులోకే వదులుతున్నారు. శంషాబాద్ రెవెన్యూ మండల పరిధిలోని కొత్వాల్‌గూడ సర్వే నంబర్ 54లో 270 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో అత్యధిక భాగం పలు ప్రజా అవసరాలకు వినియోగించారు. ఏపీ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, హుడా, పర్యాటక శాఖ, రైల్వే వర్క్ షాప్‌లకు భూమి కేటాయించారు. 120 ఎకరాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం రూ.180 కోట్లతో కొత్వాల్‌గూడ ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేసింది. ఇవిగాక చౌడమ్మ ఆలయం, హనుమాన్ ఆలయం, శ్మశానవాటిక ఉన్నాయి. ఇవన్నీ పోను 52 ఎకరాల భూమి మిగిలింది. ఈ విస్తీర్ణం 26 మంది ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఉండటం.. దీనిపై ఉమ్మడి ఏపీ నుంచి కోర్టులో వివాదం కొనసాగుతుండగా ఇటీవల ఈ భూమి ప్రభుత్వానికి చెందినదిగా జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూమిలో కొంతమంది ఓ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించి నడుపుతున్నారు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ దాదాపు నాలుగు నెలల క్రితం శంషాబాద్ రెవెన్యూ అధికారులను న్యాయస్థానం ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. అయినా అధికారులు అక్కడికి వెళ్లి కేవలం బోర్డు పెట్టి తిరిగి వచ్చారు. కానీ స్వాధీనం చేసుకోకపోవడంతో కన్వెన్షన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.