కరీంనగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటన సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు శనివారం రాత్రి కలెక్టర్ పమేలా సత్పతి మెమోలు జారీ చేశారు. ఈ నెల 24న కరీంనగర్లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం, పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల తోపులాట జరగడంతో మంత్రి పొంగులేటి కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కల్పించుకుని కనీసం ఏసీపీ కూడా ఇక్కడ లేరని వ్యాఖ్యానించారు. కలెక్టర్‌ను ఉద్దేశించి ‘కామన్ సెన్స్ ఉండదా” అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు(టౌన్), ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారి, డీఆర్డీవోలకు మెమోలు జారీ చేసి సంజాయిషీ కోరారు.
అధికార వర్గాల్లో కలకలం
కలెక్టర్ జారీ చేసిన నోటీసులు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మంత్రులు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం వివరణ కోరినట్టు స్పష్టమవుతున్నది. కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామికి ఇచ్చిన మెమోలో భద్రత విషయంలో వైఫల్యాలను పొందుపర్చారు. హెలీప్యాడ్ వద్ద, ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్డీవోకు ఇచ్చిన మెమోలో పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ వద్ద అధికారులకు కేటాయించిన విధుల వద్ద వారు ఉన్నారా? లేరా? అనే విషయమై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.