Industrial Park | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఇండస్ట్రియల్ పార్క్ కోసం రంగారెడ్డి జిల్లా, మహేళ్వరం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో 131 మంది రైతుల నుంచి 198.21 ఎకరాల సీలింగ్ భూములు సేకరించేందుకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భూములను సాగుచేసుకుంటున్నవారిలో అత్యధికంగా దళితులు, గిరిజనులే ఉన్నారు. ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకతను పోలీసు బలగాలతో అణిచివేస్తూ ప్రభుత్వం భూసేకరణ సాగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామికవాడల ఏర్పాటు కోసం ఇప్పటికే వికారాబాద్ జిల్లా లగచర్ల, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలు, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ తదితర ప్రాంతాల్లో భూసేకరణ నోటిఫికేషన్లు జారీ అయిన విషయం విదితమే. తాజాగా నాగిరెడ్డిపల్లిలో అధికంగా దళిత, గిరిజనుల సాగులో ఉన్న సీలింగ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు కందుకూరు డివిజన్ కార్యాలయంలో భూమి ప్లాన్ ఉన్నట్టు, పనిదినాల్లో ఎప్పుడైనా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
అధీకృత అధికారి, వారి సిబ్బంది ఎప్పుడైనా ఈ భూముల్లోకి వెళ్లి సర్వే చేసుకోవచ్చని, భూమిని చదును చేసుకోవడం, తవ్వకాలు జరపడం, బోర్లు వేయడం తదితర పనులు చేపట్టవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఇట్టి భూముల క్రయవిక్రయాలు కానీ, ఎటువంటి లావాదేవీలు కానీ జరపరాదని స్పష్టంచేశారు. నష్ట పరిహారానికి సంబంధించిన సమస్యలు, ఇతర అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా వాటిని జిల్లా కలెక్టర్, లేదా అధీకృత అధికారి సమక్షంలో నమోదు చేయవచ్చని వివరించారు. నోటిఫికేషన్ వర్తించే రైతుల్లో అధికంగా ఒక ఎకరం, అంతకన్నా తక్కువ విస్తీర్ణంగల కమతాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ప్రభు త్వం లగచర్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా అసైన్డ్ భూములనే సేకరిస్తుండటంపట్ల బాధిత దళిత, గిరిజన రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
అరకొర నష్టపరిహారంతో ఆగమవుతున్న రైతులు
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని భూములకు దేశంలో ఎక్కడా లేనంతగా గిరాకీ ఏర్పడిన విషయం విదితమే. రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్లినా ఎకరా ధర రూ.30 లక్షల నుంచి 50 లక్షలకు తక్కువ లేదు. దీంతో ఎకరా, రెండెకరాల భూమి ఉన్న చిన్న రైతులకు సైతం ఓ భరోసా ఏర్పడింది. పంటలు పండించుకొని బతకడంతోపాటు ఎప్పుడైనా అనుకోని కష్టమొస్తే ఆ భూములే తమని ఆదుకుంటాయనే విశ్వాసంతో వారు జీవిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర నష్టపరిహారం చెల్లించి రైతుల భూములను సేకరించాలని ప్రయత్నించడం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ధరను చెల్లిస్తే అదే డబ్బుతో తాము వేరే ప్రాంతంలో భూములు కొనుగోలు చేసుకుంటామని కొందరు రైతులు పేర్కొంటున్నారు. కానీ అరకొర నష్టపరిహారంతో తమ జీవితాలు రోడ్డున పడతాయని, హైదరాబాద్లో కూలీ పనులు చేసుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదని వారు వాపోతున్నారు.