నాంపల్లి కోర్టులు, మే 22 (నమస్తే తెలంగాణ) : అవినీతి, అక్రమాలతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు జూన్ 5వరకు రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి మహ్మద్ అఫ్రోజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ఉమామహేశ్వర్రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా విడుదల చేశారు. సోదాల్లో రూ. 3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని వెల్లడించారు. ఇది ప్రభుత్వ మార్కెట్ విలువ మాత్రమేనని, బహిరంగ మార్కె ట్లో విలువ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు. లాకర్లు తెరువాల్సి ఉందని, మరిన్ని ఆస్తుల సమాచారం విచారణలో వెలుగులోకి వస్తుందని తెలిపారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారిస్తామని వివరించారు.
ల్యాప్‌టాప్‌లో అవినీతి, అక్రమాల చిట్టా..
ఉమామహేశ్వర్రావు ఇంట్లో సోదా లు చేసిన సమయంలో బినామీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారు, ఆస్తుల వివరాలన్నీ అందులో ఉన్నట్టు గుర్తించారు. ల్యాప్‌టాప్‌లో దొరికే సమాచారం ఆధారంగా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఉమామహేశ్వర్రావు ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పుడు పలు సివిల్ కేసుల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయన బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమ కు జరిగిన అన్యాయంపై నోరు విప్పుతున్నారు. ఓ ల్యాండ్ విషయంలో తాను ఫిర్యాదు చేస్తే రూ.10లక్షల లంచం ఇవ్వలేదని ప్రత్యర్థుల నుంచి రూ.50లక్షలు తీసుకొని తనపైనే రెండు తప్పుడు కేసులు నమోదు చేశాడని, పైగా రౌడీషీట్ తెరుస్తానని బెదిరించాడని ఓ బాధితుడు ఆరోపించాడు. తనపై నమోదైన కేసులపై హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు సైతం ఉమామహేశ్వర్‌రావుకు మొట్టికాయలు వేసిందని చెప్పాడు.