శక్కర్ నగర్ : మానవ తప్పిదాలు, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ‘అలైవ్ అరైవ్ ‘ అనే కార్యక్రమం పేర అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు చేపట్టాల్సిన చర్యలపై సూచించారు.
అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపడం వంటి అనాలోచిత చర్యల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఏసీపీ అన్నారు. ప్రజల్లో రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహనకుగాను డీజీపీ ఆదేశాల మేరకు వారం రోజులపాటు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులు కేవలం ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.
ఈ సందర్భంగా పట్టణ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు, అతని వెంట ఉన్న వ్యక్తి హెల్మెట్లు ధరించాలని, సిగ్నల్స్ వద్ద నిబంధనలు అతిక్రమించవద్దని, రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దని అన్నారు. ముఖ్యంగా ఆటోల యజమానులు, డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాము అప్రమత్తంగా ఉన్నా ఎదుటివారి నుంచి జరిగే ప్రమాదాలను సైతం గుర్తించి వాహనాలు నడపాలన్నారు.
ఈ సందర్బంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిమిషానికి ముగ్గురు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతకు గురవుతున్నారని విమర్శించారు. కేవలం మన అజాగ్రత్త, తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రతీ ఒక్కరూ స్పందించాలని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలని, ఇందుకుగాను ప్రభుత్వం నుంచి రూ.25 వేలు ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు.
ఇలా మూడుమార్లు క్షతగాత్రులను ఆస్పత్రి తరలించిన అనంతరం నాలుగోసారి రూ.1 లక్ష అందుతోందని అన్నారు. ప్రజలు ఈ విషయంలో అవగాహన కలిగి వుండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకట నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.