షాబాద్, మే 16: హైదరాబాద్ పరిసరాల్లోని శంకర్పల్లి మండలం దొంతన్పల్లిలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో న్యాయవిద్య చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని యాసిడ్ దాడికి గురైనట్టు అనుమానాలు తలెత్తుతున్నాయి. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె ఓ ప్రైవేట్ దవాఖానలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. అయితే.. అది యాసిడ్ దాడి కాదని, వేడినీళ్లు ఒంటి మీద పోసుకోవడం వల్లే బాధితురాలికి గాయాలయ్యాయని పోలీసులు, కాలేజీ యాజమాన్యం చెప్తున్నది.
మోకిల పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి స్నానం చేసేందుకు వెళ్లిన బాధితురాలు బకెట్లో వేడినీళ్లను గమనించకుండా ఒంటిపై పోసుకొన్నది. దీంతో తీవ్ర గాయాలయ్యా యి. తోటి విద్యార్థులు ఆమెను దగ్గరలోని దవాఖానకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకొన్న పోలీసులు కాలేజీకి వెళ్లి విద్యార్థులను విచారించారు. కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
వేడినీళ్లు పడితే అంతగా గాయపడే అవకాశం లేదని, విద్యార్థిని ఒంటిపై గాయాలను బట్టి యాసిడ్ దాడికి గురైనట్టు అనుమానిస్తున్నారు. నీటిలో యాసిడ్ కలవటం వల్లే గాయాలైనట్టు అనుమానిస్తున్నారు.