మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 17:09:07

నిర్దేశిత లక్ష్యాలు సాధించండి : సింగరేణి సీఎండీ శ్రీధర్

నిర్దేశిత లక్ష్యాలు సాధించండి : సింగరేణి సీఎండీ శ్రీధర్

 మంచిర్యాల : సెప్టెంబర్‌ లో లక్షా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలి. కరోనాతో మూడు నెలలుగా సింగరేణి బొగ్గుకు కొంత డిమాండ్‌ తగ్గినప్పటికీ ఇప్పుడు పరిశ్రమలన్ని కోలుకోంటున్న నేపథ్యంలో తిరిగి బొగ్గుకు డిమాండ్‌ పెరుగనున్నది. కావున తాజాగా ఏరియాల వారీగా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌ బర్డెన్ లక్ష్యాలను సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.

గురువారం ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్‌ లో సంస్థ డైరెక్టర్లు, అడ్వయిజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో బొగ్గు ఉత్పత్తి, రవాణా, కరోనా పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి ద్వారా బొగ్గు స్వీకరిస్తున్న పరిశ్రమల నుంచి బొగ్గుకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతున్నందున ఇప్పుడు బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని జీఎంలను ఆదేశించారు. సెప్టెంబర్‌ నెలలో రోజుకి లక్షా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా పనిచేయాలన్నారు.

అలాగే అక్టోబర్‌ లో లక్షా 50 వేల టన్నులు, నవంబర్‌ లో లక్షా 60 వేల టన్నుల నుంచి లక్షా 80 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి, రవాణా చేస్తూ సింగరేణి లక్ష్యాలను తిరిగి యథాస్థితికి తేవాలని కోరారు. ముఖ్యంగా ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో ఓవర్‌ బర్డెన్ తవ్వకాలు మరింత పుంజుకోవాలన్నారు. సగటున రోజుకి ఇకపై 13 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీని తొలగించాలని ఆదేశించారు. 

కొత్త ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల మేర రావాలని కోరారు. రామగుండం1 ఏరియాలో ప్రారంభించనున్నజీడీకే5 ఓసీ గనికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు వెంటనే పూర్తి చేసి జనవరి నెలలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా సన్నాహాలు ముమ్మరం చేయాలన్నారు. కరోనా  టెస్టులు మరింత పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా ప్రారంభం కానున్న ఓసీ గనులకు అవసరమై ఉన్న అనుమతుల పనులు ఇంకా వేగవంతం చేయాలని ఆదేశించారు.


logo