నాంపల్లి క్రిమినల్ కోర్టు, నవంబర్ 14: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అరెస్టయిన ముగ్గు రు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఢిల్లీ బీజేపీ దూతలుగా వచ్చిన రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తులో ఉన్నదని, నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారుచేసే అవకాశం ఉన్నదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. నిందితులపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, వాటిపై విచారణ జరుగాల్సి ఉన్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో చాలా మందికి సంబంధాలున్నాయని, ఆ విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. రామచంద్ర భారతిపై బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో పోలీసులు పీటీ వారంట్ వేసిన విషయాన్ని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలను సమర్థిస్తూ..నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు నిలిపివేత ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగనున్నది.
నిందితుల పిటిషన్ 21కి వాయిదా: సుప్రీం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. నిందితుల బెయిల్ పిటిషన్ కేసును హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు విచారణ చేయనున్నదని, ఇకడి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. విచారణను 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్ ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది.