హైదరాబాద్ సిటీబ్యూరో/కొత్తూరు, జూలై 12 (నమస్తే తెలంగాణ): షాబాద్‌లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన ఉన్మాది రాజ్‌కుమార్ ఆచూకీపై రెండు రోజులైనా స్పష్టత రాలేదు. సీరియల్ కిల్లర్ కోసం ఫ్యూచర్ సిటీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన కారును శనివారం రాత్రి తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “ఆదివారం ఉదయం ఒక వ్యక్తి చేతిలో జామకాయ పట్టుకుని చెట్టుకింద నిలబడ్డాడు. అతడు ఆరు హత్యల హంతకుడిని పోలి ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. నేను తిమ్మాపూర్‌లో దొరుకుతుందని చెప్పాను” అంటూ కుమ్మరిగూడకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి తెలిపాడు. ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ ఉన్నదని, ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ అతడిని వెంబడించి పట్టుకున్నట్టు చెప్పాడు. అతడు చెప్పినట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ఆదివారం వైరల్‌గా మారింది. అయితే, అందులో నిజం లేదని, తమకు నిందితు డు దొరుకలేదని, అతడి కోసం ముమ్మరం గా గాలిస్తున్నామంటూ ఫ్యూచర్ సిటీ పోలీ స్ కమిషనర్ తరుణ్‌జోషి చెప్పారు.
కారు ను రైల్వే ట్రాక్ ప్రాంతంలో వదిలేసిన నిం దితుడు ఆ చుట్టుపక్కల ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని, ప్రత్యక్ష సాక్షి చె ప్పినదాంట్లో నిజం ఉండే అవకాశాలు లేకపోలేదని స్థానికంగా చర్చ జరుగుతున్నది. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్‌కు ఒకటి రెండు కిలోమీటర్ల పరిధిలోనే నిందితుడు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు కుమ్మరిగూడ, అక్కివేణిగూడ చుట్టుపక్కల అటవీ ప్రాం తంలో రాత్రంతా తలదాచుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని శంషాబాద్, కందుకూరు పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లి విచారణ చేశారని చర్చించుకొంటున్నారు. నిందితుడు రైల్వే ట్రాక్ వద్ద కారును వదిలేసి ఫిరంగి కాలువవైపు వెళ్తుంటే చూశామని మరికొందరు చెప్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ హంతకుడు రాజ్‌కుమార్ తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో ఎక్కడో ఓ దగ్గర ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.