నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 20 (నమస్తే తెలంగాణ): లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితోపాటు 36 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. కానీ మరో నిందితుడైన సురేశ్ మాత్రం 60 రోజులుగా రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులోనే మగ్గుతున్నాడు. ఆయన విడుదలను కుట్రతో కొందరు అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ ఇప్పటివరకు జమానత్‌లను కూడా కోర్టుకు సమర్పించలేదు. విడుదలైతే పోలీసులు అరెస్టు చేస్తారనే కారణంతో నిందితుడి తరఫున జమానత్‌లను కోర్టుకు సమర్పించలేదు. సురేశ్ విడుదలను అడ్డుకునేందుకు 145, 154,155 కేసుల్లో ప్రొటెక్షన్ వారెంట్‌పై (పీటీ వారెంట్) అరెస్టు చేసేందుకు బొంరాస్‌పేట్ పొలీసులు రంగం సిద్ధంచేశారని సమాచారం.
ఈ మేరకు పీటీ వారెంట్‌ను సోమవారం ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. ఇటీవల బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వుల ప్రకారం సురేశ్ తరఫున రూ.50 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తును కోర్టుకు సమర్పించాల్సి ఉన్నది. ప్రతీ వారంలో బుధవారం బొంరాస్‌పేట్ పోలీసుల ఎదుల హాజరుకావాలని కోర్టు షరతులు విధించింది. నేటివరకు రెండు జమానత్‌లను కోర్టుకు సమర్పించకపోవడంతో సురేశ్ విడుదలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్టయింది. ఇదే కేసులో బెయిల్‌పై విడుదలైన మరో ఇద్దరు నిందితులను జైలునుంచి విడుదలైన వెంటనే పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి హాజరుపర్చడంతో కోర్టు రిమాండ్‌కు తరలించింది. మూడు కేసుల్లో పీటీ వారెంట్లపై జైలులోనే నిర్బంధించేందుకు పైస్థాయిలోనే కుట్ర జరుగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ తరఫున దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైనట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారి, కొడంగల్ అభివృద్ధి అధికారులపై రైతులు దాడులకు పాల్పడినట్టు తేల్చి హత్యాయత్నం సెక్షన్‌తోపాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చట్టం కింద కేసు నమోదు చేయడంతో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు ఈ కేసు బదిలీ అయ్యింది. మిగతా మూడు కేసుల్లో పీడీపీపీ సెక్షన్లను జోడించకపోవడం వల్ల ప్రత్యేక కోర్టుకు బదిలీ కాలేదు. మూడు కేసుల్లో అరెస్టు చేస్తే, రెగ్యులర్ బెయిల్ మంజూరుకు ఆటంకం కలుగుతుందన్న కుట్ర స్పష్టంగా కనిసిస్తున్నది.