పటాన్చెరు, సెప్టెంబర్ 10 : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి స్పెషల్ పోక్స్ కోర్టు జడ్జి కే జయంతి తీర్పు ఇచ్చారని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఎనిమిది సంవత్సరాల క్రితం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం బొల్లారంలోని లక్ష్మీ నగర్ కాలనీలో భూస్వామి కృష్ణారావు ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగించారన్నారు. 2019 మే 3వ తేదీ నాడు రాత్రి కృష్ణారావు కుమారుడు దుర్గాప్రసాద్ తన ఇంటి బిల్డింగ్ పైకి ఓ బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిపారు. బాధితురాలు తల్లిదండ్రులు బొల్లారం పీఎస్లో అత్యాచారానికి సంబంధించి ఫిర్యాదు చేశారన్నారు. అప్పటి ఎస్హెచ్వో లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారన్నారు. పటాన్చెరులో అప్పుడు పని చేసిన డిఎస్పి ఆర్ రాజేశ్వరరావు సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టగా కేసు పూర్వపరాలను పరిశీలించి జడ్జి తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. అత్యాచారం పాల్పడిన జ్ఞానేశ్వర్ అలియాస్ దుర్గాప్రసాద్(20) బీటెక్ చదువుకున్నారని తెలిపారు. నిందితునికి శిక్షపడేలా కృషిచేసిన పోలీస్ అధికారులకు అభినందించారు.