హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ట్రావెన్కోర్ ఫైనాన్స్ కేసులో 36 ఏండ్లుగా తప్పించుకొని తిరిగిన మోస్ట్ వాంటెడ్ నిందితురాలు మరియమ్మ అలియాస్ లీలమ్మ జోసెఫ్ (69)ను సోమవారం అరెస్టు చేసిన తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. 1987లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న సీఐడీ ఏడీజీ మహేశ్ భాగవత్ సూచనల మేరకు ఎస్పీ బీ రాంరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కేరళలోని పలు ప్రాంతాల్లో ఆమె కోసం గాలించాయి.
పత్తినంతిట్ట జిల్లా పంపా పోలీస్స్టేషన్ పరిధిలోని కిసాహుమాయి గ్రామంలో మరియమ్మను అదుపులోకి తీసుకొన్నారు. ఈ వైట్కాలర్ నేరంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన మరియమ్మపై నాంపల్లి కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి ఉంది. ఈమెను అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐడీ బృందాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి త్వరలో డీజీపీ రివార్డులు అందజేయనున్నట్టు సీఐడీ చీఫ్ మహేశ్ భాగవత్ వెల్లడించారు.