Adilabad | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో వంట పాత్రలపై పురుగుల మందు చల్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఇందుకు సంబంధించిన పత్రిక ప్రకటన జారీ చేశారు. పాఠశాలకు ఆది, సోమవారాలు సెలవు దినం కావడంతో ఉపాధ్యాయులు తాళం వేసుకొని వెళ్లారు. ధర్మపురి గోండ్ గూడ నివాసి సోయం కిస్టు అనే వ్యక్తి పాఠశాల వంటగది తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. గదిలోని వంట పాత్రతో పాటు ఒక బకెట్లో తెలుపు రంగుతో కూడిన పురుగుల మందు పోశాడు. మంగళవారం ఉదయం పాఠశాల వంటగది తాళం తీసిన ఉపాధ్యాయులకు వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుని అరెస్టు చేశారు. నిందితుడు కిస్టు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.