సైదాబాద్, జూలై 21: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్ వాణీనగర్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వివరాల్లోకి వెళ్తే.. వాణీనగర్‌కు చెందిన రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ షేక్ అబ్దుల్ సయ్యద్ కుమారుడు నవీద్ (47) గత కొంతకాలంగా అమెరికాలోని మార్క్ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
అతని భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహ నహీం షేక్ (19), కుమారుడు హఫీజ్ ఒమర్ (14), చిన్న కుమార్తె ఖతిజా షేక్ (8) కలిసి కారులో శాన్‌జోస్ పట్టణం నుంచి నెవాడాకు వెళ్తున్నారు. నజియా సల్మా నడుపుతున్న ఆ కారు అదుపుతప్పి మరో కారును ఢీకొన్నది. దీంతో నజియా సల్మా, నేహ నహీం షేక్, హఫీజ్ ఒమర్‌తోపాటు మరో కారులోని డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న అబ్దుల్ నవీద్, ఖతిజా షేక్ (8) కాలిఫోర్నియాలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో వాణీనగర్‌లోని బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నేత అమ్జాదుల్లా ఖాన్, ఇతర మైనారిటీ నేత లు బాధిత కుటుంబసభ్యులను ఓదార్చేందు కు ప్రయత్నించారు. తాము కాలిఫోర్నియాకు వెళ్లేందుకు వీలుకల్పించాలని, అప్పటి వరకు మృతదేహాలను భద్రంగా ఉంచేలా చూడటంతోపాటు వాటిని రప్పించేందుకు సాయం అందించాలని నవీద్ తండ్రి అబ్దుల్ సయ్యద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.