హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్‌కు అర్హులై ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11 నుంచి 30 వరకు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుదారుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవద్దని, వాటన్నంటినీ తామే చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించడంతో కొత్తగా లక్షల మంది అర్హత సాధించారు. వీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు చివరి వరకు అవకాశం ఇవ్వడంతో 7 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నారు.
అర్హుల్లో ఇంకా కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. అనంతరం ఆ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుందని వివరించారు. వృద్ధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వికలాంగులకు రూ.3016, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా వ్యాధిగ్రస్థులకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే.