తాండూరు రూరల్, డిసెంబరు 3 : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.16,500 స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 11 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించేందుకు డాక్యుమెంట్ రైటర్ సాయికుమార్‌ను సంప్రదించాడు. ఒక్కోప్లాట్ రిజిస్ర్టేషన్ రూ.2,000 చొప్పున మొత్తం రూ.22,000 అవుతాయని సాయికుమార్ తెలిపాడు. కొంచెం తక్కువ చేయాలని కోరగా, ఒక్కో ప్లాట్ రిజిస్ర్టేషన్‌కు రూ.1,500కు ఒప్పందం చేసుకున్నారు. 11 ప్లాట్లలో 4 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూరయ్యింది. మిగతా 7 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. బుధవారం ఫిర్యాదుదారుడు రూ.16,500 ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్‌కు ఇచ్చేందుకు యత్నించగా, డాక్యుమెంట్ రైటర్ సాయికుమార్‌కు ఇవ్వాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లు సాయికుమార్, అశోక్‌కు రూ.16,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ఆనంద్ తెలిపారు.
ఏసీబీకి చిక్కిన సర్వేయర్ రూ. 20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
వెల్దుర్తి, డిసెంబర్ 3 : ఓ రైతు పొలాన్ని సర్వే చేయడానికి సర్వేయర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్టు మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. వెల్దుర్తికి చెందిన ఓ రైతు తన ఎకరం పది గుంటల భూమిని సర్వే చేయాలని వెల్దుర్తి సర్వేయర్ శ్రీనివాస్‌ను సంప్రదించాడు. భూమిని రెండుసార్లు డిజిటల్ సర్వే చేయాలని, ఇందుకు రూ. 20 వేలు అవుతుందని రైతుకు సూచించారు. బుధవారం డబ్బులు ఇవ్వడానికి సర్వేయర్‌ను కలువగా.. ట్రైనీ సర్వేయర్ శరత్కుమార్గౌడ్కు ఇవ్వాలని సూచించారు. శరత్‌కుమార్‌కు రైతు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.