హయత్‌నగర్/ నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 13 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట డీఎస్పీ కొండం పార్థసారథి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లతోపాటు అక్రమంగా దాచిన 90 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీగా పనిచేస్తున్న కొండం పార్థసారథి హయత్‌నగర్‌లోని దత్తాత్రేయనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సూర్యాపేట-2 పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో డీఎస్పీ పార్థసారథితోపాటు సూర్యాపేట పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో పీ వీరరాఘవులు నిందితుల నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది.
మంగళవారం పార్థసారథి ఇంటిపై ఏసీబీ హైదరాబాద్ సిటీ రేంజ్-2 ఇన్స్పెక్టర్ సీహెచ్ మురళీమోహన్, టీం సభ్యులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 21లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్ల స్టాండ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ నాగరాజ్‌గౌడ్ తెలిపారు. పార్థసారథితోపాటు వీరరాఘవులును నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపర్చగా, ఇన్చార్జి జడ్జీ రఘురామ్ 14రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రూ.25 లక్షల లంచం డిమాండ్ చేసి, రూ.16 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టారంటూ ఫిర్యాదుదారుడు చే సిన ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు.