నిజామబాద్/మద్దూరు/అల్వాల్/హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఏసీబీ అధికారులకు మరొక భారీ అవినీతి తిమింగలం దొరికింది. వందల కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల సరసన మరొక అధికారి చేరారు. ఆయనే నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి. సుమారు రూ.80 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన అయనను ఏసీబీ అధికారులు లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మల్లారెడ్డి అవినీతి, అక్రమ మార్గాలకు పాల్పడుతూ.. భారీగా ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఏసీబీ హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట సహా పలుచోట్ల ఈ సోదాలు చేపట్టింది. అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బీ) ఆర్/డబ్ల్యూ 13(2) కింద కేసు నమోదు చేసిన ఏసీబీ మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృతంగా సోదాలు చేపట్టింది.
మూడుచోట్ల సోదాలు
నిజామాబాద్‌లో ఏసీబీ బృందాలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంతోపాటు శ్రీనగర్ కాలనీలో మల్లారెడ్డి నివాసముండే ఇంట్లో సోదాలు నిర్వహించాయి. అనంతరం మల్లారెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్లి తనిఖీలు చేశాయి. కొమ్మూరి మల్లారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లిలోనూ సోదాలు చేశారు. ఆయన ఇంటితోపాటు ఆయనకు సంబంధించిన ఏడు ఎకరాల భూమిని కౌలుకు సాగుచేస్తున్న శనిగరం శ్రీనివాస్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అలాగే సర్పంచ్ శనిగరం సత్యనారాయణ, ఆయన చిన్ననాటి మిత్రుడు ఏళ్ల రామచంద్రం ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు. నిజామాబాద్ ఏసీబీ అధికారి నరేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అల్వాల్, మచ్చబొల్లారం సూర్యనగర్‌లోని మల్లారెడ్డి నివాసంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డితో పాటు కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు.
సోదాల్లో లభ్యమైన ఆస్తుల వివరాలు.
సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.3 కోట్లుగా తేలింది. అయితే బహిరంగ మారెట్లో వీటి విలువ దీనికంటే పలు రెట్లు ఎకువగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. మొత్తం ఐదు భవనాలను గుర్తించారు. ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో రూ.3,31,000 నగదు లభించగా, వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.50లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌ను కనుగొన్నారు. భార్య, కుటుంబసభ్యుల పేరిట ఉన్న 3 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. గ్రాండ్ విటారా కారు, టీవీఎస్ సూటీని స్వాధీనం చేసుకున్నారు.
మల్లారెడ్డి అరెస్టు.. రిమాండ్
అదనపు ఆస్తులకు సంబంధించి సోదాలు కొనసాగుతున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హైదరాబాద్ నాంపల్లిలోని మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.