న్యూస్ నెట్వర్క్ , నమస్తే తెలంగాణ, డిసెంబర్ 4 : ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవార్‌పేట్‌కు చెందిన వెంకటేశ్ దడువాయి(వేమాన్) లైసెన్స్ కోసం మార్చి లో దరఖాస్తు చేసుకున్నాడు. లైసెన్సు కోసం ఏవో రూ.10వేలు డిమాండ్ చేయగా వెంకటేశ్ రూ.7 వేలు అధికారికి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. శ్రీనివాస్‌ను కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్టు కా ర్యాలయంలో రసీదులకు సంబంధం లేని రూ.62,500 నగదు సీజ్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసినట్టు తెలిసింది. ఏఎంవీఐ రమేశ్, అమృతవర్షిని, కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, హోంగార్డ్ గోవిందును ఏసీబీ అధికారులు విచారణ చేసినట్టు సమాచారం. తనిఖీలో రూ.29 వేల నగదు గుర్తించామని ఏసీబీ సీఐ లింగస్వామి తెలిపా రు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండ లం వాడపల్లి ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు చేసి, రూ.86 ,600 నగదును సీజ్‌చేసినట్టు తెలిసింది.