వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాలు (ACB Raids) రెండో రోజూ కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఆలయంలో ఆకస్మికంగా దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాదాపు 10 గంటలపాటు వివిధ విభాగాల్లో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం కూడా సోదాలు కొనసాగిస్తున్నారు.
రాజన్న ఆలయంలోని ప్రధాన విభాగాల్లో కొద్ది రోజులుగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తూనికలు, కొలతలు, ఆడిట్ శాఖలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టారు. పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. గోదాం విభాగంతోపాటు లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న సరుకుల శాంపిళ్లను తీసుకున్నారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.