– రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఏసీబీ తనిఖీలు..
– కరీంనగర్లో శ్రీధర్ అరెస్టు..?
EE Sridhar | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది. ఇరిగేషన్ సీఏడీ డివిజన్ 8లో నూనె శ్రీధర్ విధులు నిర్వర్తిస్తున్నారు. చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో శ్రీధర్ పని చేస్తున్నారు. ఇక ఆయనకు సంబంధించి 12 చోట్ల ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా, కరీంనగర్, బెంగళూరులో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. బెంగళూరులో నాలుగు చోట్ల, హైదరాబాదులో ఆరు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. శ్రీధర్ కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడుతో పాటు తన సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కరీంనగర్ లో శ్రీధర్ ను అదుపులో తీసుకొన్న ఏసీబీ హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు సమాచారం.