హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : అవినీతి కేసులో విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ లోతుగా ప్రశ్నిస్తున్నది. నాలుగు రోజుల కస్టోడియల్ విచారణ నిమిత్తం చంచల్గూడ జైలు నుంచి సోమవారం ఉదయం అంబేద్కర్ను ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు.. ప్రధానంగా ఆయన అక్రమాస్తులు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టారు. ఆయన ఉద్యోగంలో చేరిన నాటినుంచి సంపాదించిన ఆస్తుల చిట్టాను బయటికి లాగుతున్నారు. అందులో భాగంగా తొలి రోజే కీలక వివరాలు సేకరించారు. ఉద్యోగ జీవితంలో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పద్ధతుల్లో లంచాలు తీసుకున్నావ్?
ఆ లంచాల సొమ్ములో ఎవరికైనా వాటాలు వెళ్లాయా? అని అంబేద్కర్ను ప్రశ్నించడంతోపాటు బినామీల పేర్లతో ఉన్న ఆస్తులకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ఆ ప్రశ్నలకు ఆయన ముభావంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు గత నెల 16న అంబేదర్తోపాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లు రూ.2.18 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.