వైరా టౌన్/రఘునాథపాలెం, మార్చి 24 : ఖమ్మం జిల్లా వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ టిప్పర్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతోపాటు నెలవారీ లెక్క కట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐతోపాటు అతడి వ్యక్తిగత సహాయకుడిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రమేశ్ వెల్లడించారు. వైరా ఎంవీఐ వరప్రసాద్, ఆయన వ్యక్తిగత సహాయకుడు రాజశేఖర్.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన ఐదు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లు ఉన్న యజమానిపై కేసు నమోదుచేశారు. నెలవారీ లంచం డి మాండ్ చేసి రూ.24,800 తీసుకుంటుండగా వీడియో రికార్డు చేసిన బాధితులు ఏసీబీ అధికారులకు అందజేశారు. వాటి ఆధారంగా రూ.50,200 అనధికార నగదు గుర్తించా రు. ఎంవీఐను అదుపులోకి తీసుకొని వరంగల్ కోర్టులో హాజరుపర్చారు. పరారీలో ఉన్న రాజశేఖర్ కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 2.65 ఇందిరమ్మ లక్షల ఇండ్ల పనులు ప్రారంభం కాగా, ఇంతవరకు 1,13,365 ఇండ్ల స్లాబ్ పూర్తి అయ్యిందని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. 34,552 ఇండ్లు రూఫ్ లెవల్ దశలో, మరో 61వేల ఇండ్లకు పునాదుల నిర్మాణం పూర్తయిందని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.5,376.22 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.