హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్‌లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లు మొత్తంగా 13చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. సోదాల్లో రూ.3.5కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతను ఉమామహేశ్వరావు చూస్తున్నారు. బాధితుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారని, నిందితులతో కలిసిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
1995 బ్యాచ్‌కు చెందిన ఉమామహేశ్వర్రావు ఆబిడ్స్, జవహర్‌నగర్ ఠాణాల్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనూ సస్పెండయ్యారు. 2022 లో ఇబ్రహీంపట్నంలో జంట హత్యలు జరుగగా, కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో అక్కడ ఏసీపీని సస్పెండ్ చేసి, ఆ స్థానం లో ఉమామహేశ్వర్‌రావును నియమించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత భూసెటిల్మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల తర్వాత జరిగిన బదిలీల్లో ఉమామహేశ్వర్రావు సీసీఎస్‌కు బదిలీ కాగా సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతను ఆయనకు అప్పగించారు. దర్యాప్తు చేస్తుండ గానే ఇబ్రహీంపట్నంలో తమకు అన్యాయం చేశాడని ఉమామహేశ్వర్‌రావుపై కొందరు ఆరోపణలు చేశారు. సైబరాబాద్ పరిధి మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ల్యాండ్ సెటిల్మెంట్లోనూ ఈయ న తలదూర్చినట్టు ఆరోపణలున్నాయి. మొత్తానికి వివాదాస్పద అధికారిగా డిపార్ట్మెంట్లో పేరు తెచ్చుకున్నాడు. అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో మంగళవా రం అశోక్‌నగర్‌లోని ఉమామహేశ్వర్రావు ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్లో ఉండే ఇద్దరు బంధువుల ఇండ్లు, సీసీఎస్‌లోని ఆయన ఛాంబర్, ఎల్బీనగర్లోని ఆయన స్నేహితులు, వైజాగ్, నర్సిపట్నం తదితర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇండ్లలో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేశారు. భారీ ఎత్తున నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
ఏకకాలంలో 13 చోట్ల సోదాలు చేశాం. 17 ప్రాపర్టీలను గుర్తించాం. 5 ప్లాట్లు ఘట్కేసర్లో ఉన్నాయి. రూ.38లక్షలు, 60 తులాల బంగారం సీజ్ చేశాం. వీటి విలువ రూ. 3.5 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో మరింత ఎక్కువ ఉంటుంది. శామీర్‌పేట్‌లో విల్లాను గుర్తించాం. వైజాగ్‌లోనూ ఆస్తులున్నాయి. సోదాల్లో సందీప్ పేరుతో డాక్యుమెంట్లు లభించాయి. ఆ పేరుతో చాలా మంది పోలీసులున్నారు. వారిలో ఎవరనేది గుర్తించాల్సి ఉంది. సోదాల తర్వాత ఉమామహేశ్వర్‌రావును మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తాం. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
– ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర