నాంపల్లి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తూ వందల కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేరూర్ నికేశ్కుమార్ కేసులో నిజాలు నిగ్గుతేల్చాల్సి ఉందని ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టుకు తెలిపారు. నిందితుడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అరెస్టు సమయంలో నికేశ్కుమార్ విచారణకు సహకరించలేదన్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి విచారణ జరిపారు. నిందితుడికి నోటీసులు జారీ చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
నికేశ్ అక్రమాస్తులపై 19చోట్ల జరిపిన దాడుల్లో నివ్వెరపోయే నిజాలు బయట్టపడ్డాయని ఏసీబీ అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు. 5 భవనాలు, 6.5 ఎకరాల వ్యవసాయభూమి, 6 స్థలాలు, వాణిజ్య స్థలాలు గుర్తించామని, వాటి పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. నికేశ్ ఆస్తులు రూ.600 కోట్లు ఉంటాయన్న సమాచారంపైనా అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
శంషాబాద్ రూరల్, డిసెంబర్ 5: ఇండిగో విమానంలో ఎయిర్హోస్టెస్ పట్ల ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. గురువారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడు ఎయిర్లైన్స్ సిబ్బందితోపాటు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎయిర్లైన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికుడిని కామారెడ్డి జిల్లాకు చెందిన నర్సింహులుగా గుర్తించారు. మాల్దీవులు దేశంలో పనికి వెళ్లిన నర్సింహులు పనిముగియడంతో అక్కడి నుంచి బెంగుళూరుకు చేరుకున్నాడు. అనంతరం హైదరాబాద్కు వచ్చేందుకు విమానం ఎక్కిన నిందితుడు సిగరెట్ తాగేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులపై చిందులు వేయడంతోపాటు ఎయిర్లైన్స్ సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించాడు. కేసు నమోదు చేసి నర్సింహులును అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై అప్పారావు తెలిపారు.