నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల ఏడుగురు లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. వారిలో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు టీవీ రిపోర్టర్. భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సీఐ, టీవీ రిపోర్టర్‌ను వలపన్ని పట్టుకున్నారు. సీఐ సతీశ్‌కుమార్‌కు, బాధితుడికి బిగ్‌టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపి మధ్యవర్తిగా వ్యవహరించారు. సీఐని, రిపోర్టర్ గోపిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి పూర్తి ఆధారాలతో వారిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జనగామ జిల్లా చిల్పూరు లో వారసత్వ భూమిని సర్వేచేసి మ్యుటేషన్ చేసేందుకు రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఆర్ఐ వినీత్‌కుమార్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
చిల్పూరుకు చెం దిన ఆవుల లింగయ్యను లంచం డిమాండ్ చేయగా, రూ.26 వేలు ఇస్తుండగా, పట్టుకున్నట్టు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని ఎంపీడీవో ఆఫీస్‌లో పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌శర్మ రూ. 7,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డా డు.
నందిపేట మండలం డొంకేశ్వర్‌లో సీసీ రోడ్డు పనుల బిల్లుల మంజూరుకు శ్రీనివాస్ శర్మ లంచం సొమ్ము తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీపీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డీఈఈ రఘు రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్ కాలనీ లో కాంట్రాక్టర్ రమేశ్ రోడ్డు పనులు చేయగా, బిల్లుల మంజూరుకు డీఈఈ, సిబ్బంది రాకేశ్, సురేశ్ లంచం డిమాండ్ చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ పట్టుకున్నారు.