భద్రాచలం, ఏప్రిల్ 10 : గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్‌మన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 19న బూర్గంపాడు లక్ష్మీపురానికి చెందిన ఓ లారీలో గ్రావెల్ తరలిస్తుండగా భద్రాచలంలో పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కేసు లేకుండా లారీని విడిచిపెట్టేందుకు యజమాని నుంచి సీఐ గన్‌మన్ రామారావు రూ.30 వేలు డిమాండ్ చేశారు. లారీ యజమాని రూ.20 వేలు సమకూర్చుకుని గన్‌మన్ రామారావుకు ఇవ్వడానికి రాగా ఆ డబ్బులు సారపాకకు చెందిన కార్తీక్‌కు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఫోన్‌పే చేయించుకుని లారీని విడిచిపెట్టారు. లారీ యజమాని ఏసీబీ అధికారులకు విషయాన్ని వివరించగా గురువారం భద్రాచలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు సారపాకలో కార్తీక్‌ను అదుపులోకి తీసుకుని, భద్రాచలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని గన్‌మన్ రామారావు, సీఐ బరపాటి రమేశ్‌ను అదుపులోకి తీసుకొని ముగ్గురిని కలిపి విచారించారు. ముగ్గురిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. గన్‌మన్ చేసిన తప్పునకు తనను ఇరికించారని సీఐ రమేశ్ ఏసీబీ డీఎస్పీతో సీఐ వాగ్వాదానికి దిగారు.