జగిత్యాల రూరల్/మంచిర్యాల అర్బన్/ఓసిటీ(వరంగల్)/హనుమకొండ, మే 5 : రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయా ల్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా శాఖల్లో అవినీతిపై ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టినట్టు తెలిసింది. జగిత్యాల కలెక్టరేట్లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు రికార్డులు, కంప్యూటర్లు పరిశీలించి పలువురిని విచారించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు సరిగా అందుతున్నాయా? లేదా? అనే అనుమానంతో హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని వరంగల్ జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తున్నారు. హనుమకొండ రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్ ఇండ్లలోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ అద్దెకు ఉన్న ఇంట్లో అధికారులు తనిఖీలు చేసినట్టు సమాచారం.
ఏసీబీ కేసులో ప్రైవేట్ డ్రైవర్ అరెస్ట్
సబ్ రిజిస్ట్రార్ ఖదీర్ కోసం తన ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేసిన కేసులో ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఫహీమ్ను ఏసీబీ అధికారులు మంగళవారం ఖమ్మంలో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్‌కు తరలించారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించిన ఖదీర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.