మాల్, సెప్టెంబర్ 30 : సర్టిఫికెట్ జారీ చేసేందుకు పాడి రైతు వద్ద లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లాలో ఓ పశువైద్యాధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం నసర్లపల్లికి చెందిన పాడి రైతు బర్రెలపై రూ.10 లక్షల బ్యాంకు లోన్ తీసుకునేందుకు వీలుగా సదరు బర్రెలకు సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్ జారీ కోసం పశువైద్యాధికారి జీజే పాల్‌ను సంప్రదించాడు.
సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.8 వేలు లంచం డిమాండ్ చేయగా, రూ.6 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు రైతు సోమవారం పశువైద్యాధికారికి అతడి కార్యాలయంలో రూ.6 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పశువైద్యాధికారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.