KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని సూచించింది.
ఈ కేసులో కేటీఆర్‌తో పాటు అధికారులకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులిచ్చింది. వీరిని ఏడో తేదీ విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు రిజర్వ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.
ఏసీబీ నమోదు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టగా.. కేటీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందని ఆయనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే హైకోర్టును కోరారు. ప్రభుత్వాలు మారితే.. పాత పాలకులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అయితే ఇకపై ఎవరూ మంత్రిగా పని చేయలేరని పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించి భాగస్వాములైన సంస్థలు ఒక్క పైసా కూడా కేటీఆర్‌కు చెల్లించనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని, దీనిపై అవినీతి కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరిగితే అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుందని, అందువల్ల పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 3(1)(ఏ) కింద కేసు నమోదుకు వీలు లేదని స్పష్టంచేశారు. జరిగిన నేరం ఏమిటో, ఎక్కడ జరిగిందో ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని తెలిపారు. నేరం ఏమిటో ఎకడో పేరొనకపోవడాన్ని బట్టి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని తుది ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కేసులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకూ పిటిషనర్ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించింది.