ఆదిలాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మాస్ మీడియా అధికారిగా పనిచేస్తున్న రవిశంకర్ శుక్రవారం రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇటీవల గుడిహత్నూర్ మండలంలో ఓ బాలిక గర్భందాల్చగా, మందులు విక్రయించిన మెడికల్షాపుపై నమోదైన కేసులో విచారణ అధికారిగా రవిశంకర్ ఉన్నారు. మందుల షాపు యజమానికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బాధితుడు మాస్ మీడియా అధికారికి లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు అధికారులు తెలిపారు.