KTR | హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నది. జూన్ 1న అమెరికాలోని డాలస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పార్టీ గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరు కాకుండా ఉండాలనే కుట్రతోనే సర్కారు నోటీసులు ఇచ్చిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఏసీబీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఈ నెల 28న ఫార్ములా ఈ-కార్ రేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసులు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఈ కేసు రాజకీయ వేధింపుల కోసమే అయినప్పటికీ అధికార యంత్రాంగానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ముందుగానే యూకే, యూఎస్ఏలలో పలు ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉన్నది. తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ముందు హాజరవుతానని వారికి రాతపూర్వకంగా తెలిపాను. రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఒక మనిషిని సాధించడానికి ఏవిధమైన ప్రమాణాలూ లేకుండా అన్ని దిశలకూ ఊగిపోతున్న రేవంత్‌ను అభినందించాల్సిందే! 48 గంటల క్రితమే, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసిన వ్యక్తిగా ఆయ న పేరు ఈడీ చార్జిషీట్లో వచ్చిందని తెలిసింది. 24 గంటల్లోనే అదే రేవంత్, ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనాయకులతో సన్నిహితంగా కనిపించాడు! ఆ యనపై మనీలాండరింగ్ కేసులో ఆరోపణలున్నా ఒక బీజేపీ నాయకుడైనా ఒక మాటైనా అనలేదు. ఇవాళ నాకు ఏసీబీ నోటీసు వచ్చింది. పాలనలో, నాయకత్వంలో, మానవత్వంలో ఆయన విఫలమైనవాడై ఉండొచ్చు. కానీ చౌకబారు రాజకీయ కక్ష సాధింపులో మాత్రం తానేంటో నిరూపించుకుంటున్నాడు. బీఆర్ఎస్ ఆయన్ని భయపెడుతుందనే సంగతి నాకు తెలుసు. కాబట్టి.. ట్రై చేస్తూనే ఉండు.. జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అదే నెల 6న విచారణకు పిలిచింది. కేటీఆర్ తన లాయర్‌తో కలిసి జనవరి 6న విచారణకు హాజరైతే.. ఏసీబీ లాయర్‌ను అనుమతించబోమని తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే.. కేటీఆర్ లిఖితపూర్వకంగా తన సమాధానం రాసి ఇచ్చారు. అనంతరం జనవరి 7న హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులిచ్చింది. దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతుండటంతో కేసు తేలే వరకూ రానని కేటీఆర్ చెప్పారు. దీంతో జనవరి 8న మళ్లీ నోటీసులిచ్చిన ఏసీబీ 9న హాజరుకావాలని కోరింది. జనవరి 9న మరోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో పథకం ప్రకారం ఎంట్రీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేటీఆర్‌ను జనవరి 16న విచారణకు పిలిచింది. జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40కిపైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఇదే కేసులో విచారణ కోసం మే 28న హాజరుకావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై స్పందిస్తూ.. ‘అమెరికాలో జూన్ 1న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కేటీఆర్ వెళ్లకుండా ఆపేందుకు ఏసీబీ నోటీసులంటూ రేవంత్ డ్రామాలాడుతున్నాడు. చౌకబారు రాజకీయాలతో రేవంత్ ఇంకా దిగజారి ప్రజల్లో చులకనవడం ఖాయం. మీ తాటాకు చప్పుళ్లకు కేటీఆర్ భయపడే రకం కాదు’ అని అన్నారు.
సీఎం రేవంత్ కుటీల రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే కుట్రతోనే నోటీసులు జారీ చేసినట్టు పరిగణిస్తున్నామని ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ‘ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది’ అని కవిత స్పందించారు.
నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌కు మళ్లీ నోటీసులు జారీచేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ సర్కారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీచేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో కేటీఆర్‌పై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమని మండిపడ్డారు.
సీఎం రేవంత్ ప్రజల దృష్టిని మరల్చడానికే కేటీఆర్‌కు నోటీసులు ఇప్పించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ‘సీఎం రేవంత్ వైట్-కాలర్ అవినీతిని ఈడీ బయటపెట్టింది. మిస్‌వరల్డ్ పోటీలను అసభ్యంగా నిర్వహించారు. రాహుల్‌గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేటీఆర్‌కు నోటీసులు ఇప్పించారు’ అని దాసోజు శ్రవణ్ విమర్శించారు.
‘మోదీని రేవంత్ కలిసిన తెల్లారే మా నాయకుడికి ఏసీబీ నోటీసులు ఇచ్చారు. వీళ్ల చీకటి అనుబంధానికి ప్రజలు బుద్ధి చెప్తారు. రాజకీయ కోణంలో మా నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ సమాజం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు.
అమెరికాలోని డాలస్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున వస్తున్న స్పందనను ఓర్వలేక కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపడం రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఈ కుట్రల వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. బీఆర్ఎస్కు ప్రజల్లో ఇంకా ఆదరణ పెరుగుతుందని, ఇదే ఉత్సాహంతో డాలస్‌లో జూన్ ఒకటిన జరిగే సభలను విజయవంతం చేస్తామని స్పష్టంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాజకీయ క్షక్ష సాధింపునకే ఇలాంటి దుర్మార్గాలకు దిగుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తామంతా కేటీఆర్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు.