జగిత్యాల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : జగిత్యాలలో తప్పుడు రిజిస్ట్రేషన్‌పై ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘జగిత్యాలలో భూమాయ!’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం రేపింది. తప్పుడు అసెస్మెంట్, ఇంటి నంబర్లతో భూమి రిజిస్ట్రేషన్‌ను వెలుగులోకి తేవడం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు జగిత్యాల మున్సిపాలిటీలో మంగళవారం సోదాలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని, 14 విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద లావాదేవీలు ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంలోని ప్రధాన బాధితుడైన కోరెపు గంగారం కొడుకు రాజ్‌కుమార్‌ను పిలిపించి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. జగిత్యాల మున్సిపాలిటీ రికార్డుల్లో అనేక అవకతవకలను గుర్తించామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల ద్వారా మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి రాలేదని తేలిందన్నారు. నాలుగు ఆటోలు, ట్రాక్టర్ కనిపించకుండా పోయాయని చెప్పారు.
షాపింగ్ క్లాపెక్స్కు టెండర్లు నిర్వహించకపోవడంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. చెత్త కలెక్ట్ చేసే వాహనాల మరమ్మతులు, డీజిల్ బిల్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రాసెస్, రసాయనిక పదార్థాల కొనుగోలు, వీఎల్టీ, ఇంటి నంబర్ల అసెస్మెంట్స్, మ్యుటేషన్స్లో తేడాలను గుర్తించామన్నారు. అన్ని రికార్డులు పరిశీలించిన తదుపరి ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేస్తామని వెల్లడించారు.