నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించి అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసులో నిందితుడైన గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరామ్‌ను 10 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సహకరించకపోవడంతో విచారణకు సమయం సరిపోలేదని, ఆయన నుంచి అక్రమ ఆస్తుల వివరాలను తెలుసుకోవాల్సి ఉన్నదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన హరిరామ్ అవినీతికి పాల్పడినట్టు అభియోగాలు రావడంతో ఏసీబీ అధికారులు శనివారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలను జప్తు చేశారని, హరిరామ్ రూ.100 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. ఆయనకు హైదరాబాద్‌లోని షేక్‌పేట, కొండాపూర్‌లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్‌లో 3 పాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్‌కాలనీలో రెండు గృహాలు, బొమ్మల రామారంలోని 6 ఎకరాల్లో ఫామ్హౌజ్తోపాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారని వివరించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హరిరామ్ తరఫు న్యాయవాదిని ఆదేశించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది