హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అవినీతి కేసులలో పట్టుడిన వారిని చట్టం ముందు నిలబెట్టడంలో దర్యాప్తు అధికారులు రాజీపడొద్దని ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ స్పష్టంచేశారు. చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి మే చివరి వరకు 112 కేసులను నమోదు చేసి, ప్రభుత్వానికి తుది నివేదికలు సమర్పించామని వెల్లడించారు.
మే నెలలో మొత్తం 19 కేసులు నమోదు చేశామని, 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి, రూ.3,63,000 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆదిలాబాద్ రేంజ్‌లోని మంచిర్యాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏసీబీ కార్యాలయం చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఉపయోగకరంగా ఉందని తెలిపారు. సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.