హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (పీఎస్ఎం)ను సీఎం రేవంత్‌రెడ్డి బహూకరించారు. సంగారెడ్డి ఎస్పీ ఎం రమణకుమార్‌కు పీఎస్‌ఎంను సీఎం బహూకరించారు. వీరితో పాటు మరో 10 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ (ఎంఎస్ఎం), 19 మందికి గ్యాలంట్రీ మెడల్స్‌ను ప్రదానం చేశారు. కే రామకృష్ణ, బండి వెంకటేశ్వరరెడ్డి, ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరవేటి భానుప్రసాద్ రావు, అజెళ్ల శ్రీనివాసరావు, ఎస్ వెంకటేశ్వర్లు, మహాంకాళి మధు, కకెర్ల శ్రీనివాస్, ఏ సత్యనారాయణ, రాసమోని వెంకటేశ్వర్లు ఎంఎస్ఎం మెడల్స్ పొందారు.
ఎన్‌డీపీఎల్‌ను జల్లెడ పడుతాం
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): నేటినుంచి వారం రోజులపాటు నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ (ఎన్డీపీఎల్)పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాల నుంచి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లికర్పై నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టాస్‌ఫోర్స్ టీమ్‌లు, అన్ని జిల్లాల్లో అసిస్టెంట్ కమిషనర్ల వద్ద పనిచేసే ఎన్ఫోర్స్ టీమ్‌లు, జిల్లా టాస్‌ఫోర్స్ టీమ్‌లతోపాటు, ఎక్సైజ్ సీఐలు, సిబ్బంది ఎన్‌డీపీఎల్‌ను జల్లెడ పట్టాలని ఆదేశించారు. ఢిల్లీ, గోవా, కర్ణాటక, హర్యానాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టామని, అక్రమార్కులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.
ములుగు ఘటనపై రైతు కమిషన్ ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో విత్తనోత్పత్తి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై రైతు కమిషన్ చైర్మన్ ఏ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం రైతు కమిషన్ కార్యాలయం నుంచి ములుగు ఘటనపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో విత్తనోత్పత్తి ఘటన పురోగతిపై సమీక్షించారు. ములుగులో మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన విత్తనాలను వినియోగించి నష్టపోయిన ములుగు బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.