హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఏ సొసైటీలోనూ లేనివిధంగా మైనార్టీ గురుకులంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతున్నది. అవుట్ సోర్సింగ్‌లో నియమితులైన విశ్రాంత ఉద్యోగులే అకడమిక్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారని సొసైటీ ఉద్యోగులు నిప్పు లు చెరుగుతున్నారు. మిగతా సొసైటీల్లో సెక్రటరీతోపాటు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు ఉన్నారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ తదితర బాధ్యతలను వారే నిర్వర్తిస్తున్నారు. కానీ, మైనార్టీ సొసైటీ పాలన అందుకు భిన్నంగా కొనసాగుతున్నది. ఇక్కడ సెక్రటరీ తప్ప ఇతర పోస్టుల్లో ఇప్పటివరకు ఎవరూ లేకుండా పోయారు.
మైనార్టీ గురుకుల సొసైటీ అకడమిక్ ఇంచార్జిగా రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్‌ను, జూనియర్ కాలేజీల ఇంచార్జిగా రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను, హాస్టల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా విశ్రాంత తహసీల్దార్‌ను, అకడమిక్ సెక్షన్ ఇంచార్జిగా రిటైర్డ్ ఫార్మసిస్ట్‌ను నియమించారు. అకడమిక్స్‌తో సం బంధం లేనివారినే ప్రధాన కార్యాలయంలో నియమించారు. సాధారణంగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా సంస్థలో నియామక ప్రక్రియ చేపట్టిన సందర్భంలో ఆర్థికశాఖ అనుమతులతోపాటు, నోటిఫికేషన్ జారీచేస్తారు. కానీ మైనార్టీ సొసైటీ అవేవీ లేకుండా నేరుగా విశ్రాంత ఉద్యోగులను ఆయా పోస్టుల్లో నియమించింది. గతంలోనూ ఇలాగే విశ్రాంత ఉద్యోగులను పలు పోస్టుల్లో నియమించారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో గత మార్చిలోనే వారి సర్వీసును రద్దుచేశారు. తాజాగా సదరు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధాన కార్యాలయంలో, ప్రధాన పోస్టుల్లో పాగావేసిన ప్రైవేట్ వ్యక్తులు సొసైటీ ప్రిన్సిపాళ్లు, ఉద్యోగ, ఉపాధాయులతో సంబంధం లేకుండా, వారిని సంప్రదించకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్సులను ప్రవేశపెట్టడం, అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం, డైట్ తదితర టెండర్లను ఖరారు చేయడం వంటి కీలక అంశాల్లో చక్రం తిప్పుతున్నారు. కమీషన్ల దందాకు తెర లేపుతూ సొసైటీని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని సొసైటీ ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా జూనియ ర్ కాలేజీ ఇంచార్జిగా నియామకమైన విశ్రాంత ప్రిన్సిపాల్ అనేక అక్రమాలకు తెర లేపారని తెలిసింది. ఒకవైపు సొంతంగా వొకేషనల్ కాలేజీని నిర్వహిస్తున్న సదరు విశ్రాంత ఉద్యోగి సొసైటీ వొకేషనల్ కాలేజీలపై పెత్తనం చెలాయిస్తున్నారు.
ప్రిన్సిపాళ్లను సంప్రదించకుండా ఇటీవల నేరుగా వొకేషనల్ కాలేజీలను ప్రవేశపెట్టారు. త్రిసభ్య కమిటీతో సంబంధం లేకుండానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. టెండర్లు, స్టేషనరీ తదితర కొనుగోళ్లలో కమీషన్లు వసూలు చేస్తున్నారని సొసైటీ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఆయనే కాదు ప్రధాన కార్యాలయంలో పాగా వేసిన ప్రైవేట్ వ్యక్తులే మొత్తంగా పెత్తనం చేస్తున్నారని సొసైటీ సిబ్బంది వాపోతున్నారు. సొసైటీలో అడ్మిషన్లు సజావుగా కొనసాగకపోవడానికి, వేతనాలు సకాలంలో విడుదల కాకపోవడానికి సదరు ప్రైవేట్ వ్యక్తులే కారణమని ఉద్యో గ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
సాధారణంగా ప్రభుత్వంలో శాఖల పరంగా విజిలెన్స్ విభాగాలు ఉండటం పరిపాటి. కానీ మైనార్టీ సొసైటీ మాత్రం ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 25 నుంచి 30 మందిని నియమించింది. ఒక్కొక్కరికి రూ.40 వేల జీతంతోపాటు వాహన సౌకర్యం కల్పించింది.
ఇందుకోసం నెలకు రూ.15 లక్షల వెచ్చిస్తున్నది. జిల్లా పరిధిలోని గురుకులాలను పర్యవేక్షించడం, ప్రిన్సిపాళ్లపై నిఘా పెట్టడమే ఈ విభాగం పని. వాస్తవంగా జిల్లాస్థాయిలో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తోపాటు, ప్రతీ గురుకుల సొసైటీకి సంబంధించి ఒక ప్రత్యేక అధికారి ఆ జిల్లాలోని గురుకులాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కానీ మైనార్టీ సొసైటీ మాత్రం గురుకుల ప్రిన్సిపాళ్లపై నిఘా పెట్టేందుకే ఒక విజిలెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ విభాగం అధికారులు ప్రిన్సిపాళ్లను బెదిరించడం, అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.
కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఓ మైనార్టీ సొసైటీ విజిలెన్స్ అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో దీనిని రద్దుచేశారు. అయితే, తాజాగా మళ్లీ విజిలెన్స్ వ్యవస్థను మైనార్టీ సొసైటీ పునరుద్ధరించి ప్రైవేటుకు పెత్తనం అప్పగించింది. అంతేకాదు, కనీస అర్హతలు లేకున్నా నచ్చిన వారిని అకడమిక్ కోఆర్డినేటర్లు, కన్సల్టెంట్లు, సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లు (ఎస్ఆర్పీ) పేరిట సొసైటీ ప్రధాన కార్యాలయం లో డిప్యుటేషన్‌పై నియమించింది. తర్వాత ఆరోపణలు రావడంతో రద్దుచేశారు. మళ్లీ ఇప్పుడు అదే వివాదాస్పద వ్యవస్థను పునరుద్ధరించడం చర్చనీయాంశమైంది.
విశ్రాంత ఉద్యోగులను సొసైటీ ఇష్టారీతిన నియమించి, ప్రభుత్వ ఖజానాకు గండిపెడుతున్నదని చెప్తూ సిద్ధిపేటకు చెందిన ఒకరు రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు సైతం ఫిర్యాదు చేశారు. కానీ ఇప్ప టికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.